الفجر
The Dawn • 30 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1ప్రాంతః కాలం సాక్షిగా![1]
2పది రాత్రుల సాక్షిగా![1]
3సరి బేసీల సాక్షిగా!
4గడచిపోయే రాత్రి సాక్షిగా!
5వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?[1]
6నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?[1]
7ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?[1]
8వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.[1]
9మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?[1]
10మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?[1]
11వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;
12మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.
13కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.
14వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!
15అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;[1]
16కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.[1]
17అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;[1]
18మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;[1]
19మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.
20మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు![1]
21అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;
22మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.[1]
23ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?
24అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.
25అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!
26మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.[1]
27(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!
28నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!
29నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!
30మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"