البروج
The Great Stars • 22 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా![1]
2వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా!
3చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా![1]
4అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.[1]
5ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు.
6వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు;[1]
7మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు.
8మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే!
9ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి.
10ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది.
11నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి[1]. అదే గొప్ప విజయం.
12నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది.[1]
13నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు.
14మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు.
15సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు,[1] మహత్త్వపూర్ణుడు.[2]
16తాను తలచింది చేయగలవాడు.
17ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా?
18ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల).
19అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు.
20మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు.
21వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన[1] ఖుర్ఆన్.
22సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్)[1] లో (వ్రాయబడి) ఉన్నది.